రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన యానిమల్ సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ పార్క్ షూటింగ్ గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ 2027 మధ్యలో ప్రారంభం కానుందని ఆయన స్పష్టం చేశాడు. దీంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సీక్వెల్ గురించి వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన విషయం రణబీర్ కపూర్ పాత్ర. యానిమల్ పార్క్ లో రణబీర్ డబుల్ రోల్లో కనిపించనున్న విషయం కన్ఫర్మ్ అయ్యింది. మొదటి భాగంలో హీరో రణవిజయ్ సింగ్ ఒకరైతే.. క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన అజీజ్ హక్ మరొకరు.
ఈ ఇద్దరు ఒకేలా కనిపించే పాత్రల మధ్య జరిగే భీకరమైన ఘర్షణే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రణబీర్ నటన ఈసారి డబుల్ ఇంపాక్ట్ చూపించడం ఖాయం అనిపిస్తోంది. యానిమల్ సినిమాలోని వైలెన్స్, ఎమోషన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేశాయి. అయితే యానిమల్ పార్క్ అంతకు మించి ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. ఈ సీక్వెల్ మొదటి పార్ట్ కంటే మరింత డార్క్ గా, ఇంటెన్స్ గా ఉండనుందని.. ప్రతీకారం అనే కాన్సెప్ట్‌ను సందీప్ రెడ్డి వంగా మరింత వైల్డ్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడని సమాచారం. మొదటి భాగం క్లైమాక్స్‌లో వదిలిన ట్విస్ట్‌ను బేస్ చేసుకుని, కథను ఊహించని మలుపులతో, భారీ స్కేల్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ 2027 వరకు వెళ్లడానికి కారణం ప్రీ-ప్రొడక్షన్ పనులే అని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా తన సినిమాల విషయంలో అస్సలు రాజీపడరు. స్క్రిప్ట్, లుక్స్, లొకేషన్స్ పరంగా పక్కా ప్లానింగ్‌తో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అది పూర్తయ్యాకే పూర్తి స్థాయిలో యానిమల్ పార్క్ పై దృష్టి పెట్టనున్నాడు. అందుకే ఈ గ్యాప్ వచ్చినట్లు అర్థమవుతోంది. మొత్తానికి యానిమల్ పార్క్ షూటింగ్ అప్డేట్ రణబీర్ అభిమానులకు, సినిమా ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. 2027 అంటే కాస్త సమయం ఉన్నప్పటికీ, సందీప్ వంగా మార్క్ టేకింగ్, రణబీర్ విశ్వరూపం చూడటానికి ఆ మాత్రం వెయిట్ చేయడం తప్పులేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాక్సాఫీస్ రికార్డులను మరోసారి తిరగరాయడానికి ఈ యా సిద్ధమవుతున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.