ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా జెండాను రెపరెపలాడించిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. ఈ సినిమా గురించి అప్డేట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక భారీ అప్డేట్ మెక్సికో వేదికగా వెలుగులోకి వచ్చింది. మెక్సికోలో నిర్వహించిన ప్రముఖ 'కామిక్ కాన్ ఎక్స్పీరియన్స్ - 2026' ఈవెంట్లో 'వారణాసి టు ది వరల్డ్' పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేదికపై సినిమాకు సంబంధించిన కొన్ని ప్రత్యేక వీడియోలను ప్రదర్శించారు. ఇప్పటివరకు కేవలం వార్తలకే పరిమితమైన ఈ భారీ ప్రాజెక్ట్, తొలిసారిగా గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై అడుగుపెట్టడం విశేషం. అయితే, ఈ ప్రదర్శనపై ఒక చిన్న నిరాశ కలిగించే వార్త కూడా ఉంది. ఈ ఈవెంట్లో చూపించిన ప్రత్యేక వీడియోలు కేవలం అక్కడ హాజరైన వారి కోసం మాత్రమే పరిమితం చేశారు. వీటిని ప్రస్తుతానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అంటే, యూట్యూబ్ లేదా సోషల్ మీడియాలో విడుదల చేయడం లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
'వారణాసి' తెరవెనుక దృశ్యాలను చూడాలంటే అభిమానులు మరికొంత కాలం వేచి ఉండక తప్పదు. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం మహేష్ బాబు పాత్ర. ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. రుద్ర అనే ఒక పవర్ఫుల్ మరియు ఇంటెన్స్ పాత్రతో పాటు, ఆధ్యాత్మిక పౌరాణిక ఛాయలు ఉన్న శ్రీరాముడి పాత్రలో కూడా మహేష్ మెరవనున్నాడు. ఈ రెండు పాత్రల చుట్టూ కథ ఎలా తిరుగుతుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి తన సినిమాల్లో హీరోలను మునుపెన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేస్తారు, మరి ఈసారి మహేష్ బాబుని 'రుద్ర'గా ఎలా చూపిస్తారో అన్న ఉత్కంఠ సినీ అభిమానుల్లో రోజురిజుకూ పెరిగిపోతోంది.
రాజమౌళి సినిమా అంటే కేవలం హీరో మాత్రమే కాదు, ప్రతి పాత్రకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. 'వారణాసి' కోసం ఆయన అంతర్జాతీయ స్థాయి నటీనటులను ఎంపిక చేస్తుండడం విశేషం. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో పవర్ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నారు. ఆయన నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన తన మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. సమ్మర్ కానుకగా వస్తున్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.