బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం' ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ, ట్రైలర్ విడుదల తర్వాత వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా శ్రీరాముడి పాత్రకు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఎంపిక కావడంపై నెటిజన్లు మరియు ప్రముఖుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.గతంలో రణబీర్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో తనకు మాంసాహారం, ముఖ్యంగా గోమాంసం అంటే ఇష్టమని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. హిందువులకు అత్యంత పవిత్రమైన గోవును చంపి తినే వ్యక్తిని, కోట్లాది మంది ఆరాధించే శ్రీరాముడిగా ఎలా చూడగలమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
"రాముడి పాత్రకు ఉండే పవిత్రతను రణబీర్ కాపాడగలడా?" అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఈ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలి అనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. రాముడి పాత్ర పోషించే నటుడికి ఉండాల్సిన లక్షణాల గురించి సద్గురు తనదైన శైలిలో స్పందించారు. రాముడు అంటే కేవలం ఒక పాత్ర కాదు, ఆయన ఒక ఆదర్శం. అటువంటి పాత్రను పోషించే నటుడికి రాముడిపై అచంచలమైన విశ్వాసం, భక్తి ఉండాలి. నటుడిలో కేవలం బాహ్య సౌందర్యం ఉంటే సరిపోదు. అతని వ్యక్తిత్వంలో 'జెంటిల్మెన్' తనం ఉండాలి. నటుడిని చూసినప్పుడు ప్రేక్షకుడికి రాముడు కనిపిస్తున్నాడు అనే భావన కలగాలి. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో నందమూరి తారక రామారావు రాముడు, కృష్ణుడు పాత్రలు పోషించి తెలుగు ప్రజల గుండెల్లో దేవుడిగా కొలువుదీరారు. ఆయనలోని దైవత్వాన్ని చూసే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని సద్గురు గుర్తుచేశారు.
సినిమాలు కేవలం నటుల వల్ల నడవవు, ప్రేక్షకుల ఆదరణ వల్ల నడుస్తాయి. ప్రేక్షకుల మనోభావాలను, వారి అభిరుచులను దృష్టిలో ఉంచుకుని దర్శకులు పాత్రల ఎంపిక చేయాలి" అని సద్గురు హితవు పలికారు.ఈ చిత్రంలో రణబీర్ కపూర్‌తో పాటు సాయి పల్లవి , సన్నీ డియోల్ , యష్ , అమితాబ్ బచ్చన్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, హ్యాన్స్ జిమ్మర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. నమిత్ మల్హోత్రా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ ప్రముఖులు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఒక పక్క సాంకేతికంగా సినిమాను ఉన్నత ప్రమాణాలతో నిర్మిస్తున్నప్పటికీ, నటీనటుల వ్యక్తిగత అలవాట్లు మరియు గతాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులు చేస్తున్న విమర్శలు సినిమా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.