పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో.. స్లమ్ డాగ్ షూటింగ్ పూర్తి… మొక్కులు చెల్లించుకున్న పూరి, ఛార్మి..!

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి కౌర్ జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు.

Post Published By: dialnews
Updated : 5 February 2026, 1:50 PM IST

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి కౌర్ జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. సినిమా షూటింగులు, ఆఫీస్ పనులతో ఎంత బిజీగా ఉన్నా.. దైవ దర్శనానికి వీళ్ళు ప్రాముఖ్యత ఇస్తారన్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరూ ఆలయంలో సంప్రదాయబద్ధంగా కనిపించి సందడి చేయడం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పూరి జగన్నాథ్, ఛార్మిలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అంటే విపరీతమైన భక్తి. వీళ్ళ బ్యానర్‌లో నిర్మించే ప్రతి సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే.. ఆ సినిమా విడుదలకు సిద్ధమయ్యే ముందు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకోవడం వారికి ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ.

ఆ సెంటిమెంట్‌ను పాటిస్తూనే, తమ తాజా చిత్రం షూటింగ్ విజయవంతంగా పూర్తి కావడంతో కృతజ్ఞతగా నేడు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్, కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా స్లమ్ డాగ్ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. తొలిసారిగా పూరీ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ నటిస్తుండటంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ సేతుపతి నాచురల్ యాక్టింగ్‌కి, పూరి మార్క్ మాస్ డైలాగ్స్ తోడైతే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నిజానికి గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చిన లైగర్, ఆ తర్వాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి.

దీంతో పూరీ కెరీర్‌కు స్లమ్ డాగ్ విజయం అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమాతో ఎలాగైనా సరే మళ్ళీ సాలిడ్ హిట్ కొట్టి, తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని పూరి కసిగా పనిచేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఫస్ట్ లుక్ లేదా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో పాటు, విజయ్ సేతుపతి క్రేజ్ కూడా తోడై... పూరి జగన్నాథ్ ఈ సినిమాతో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ స్లమ్ డాగ్ బాక్సాఫీస్ వద్ద ఎంత గట్టిగా రచ్చ చేస్తుందో చూడాలి.

Published : 
  • 5 February 2026, 1:50 PM IST