తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్...సంచలనాలు సృష్టిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించి...ఇటీవలే వంద రోజులు పూర్తి చేసుకున్నారు. అప్పుడే ప్రధాన మంత్రి రేసులోకి దూసుకొచ్చారు. సౌతిండియాలో ఎంతో మంది తలపండిన రాజకీయ నేతలు ఉన్నప్పటికీ...విజయ్ అందరి కంటే ముందున్నారు. అయితే తెలుగు నాట పవర్‌స్టార్‌గా పేరున్న పవన్ కల్యాణ్...ఆయన దరిదాపుల్లో లేరు. రేటింగ్సే కాదు..ర్యాంకింగ్స్‌లోనూ పవన్ కల్యాణ్ పేరు అడ్రస్ లేదు.2029లో ప్రధాని మంత్రి ఎవరనే సర్వే నిర్వహిస్తే...ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, విజయ్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. మరోసారి ప్రజలు నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించారు.
ఏకంగా 48.7 శాతం మంది మోడీకి మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీ రెండో స్థానంలో నిలిస్తే...27.1 శాతం మంది జైకొట్టారు. మూడో స్థానంలోకి అనూహ్యంగా తమిళనాడు సీఎం విజయ్ దూసుకొచ్చారు. టీవీకే పార్టీని స్థాపించడం...ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు విజయ్ ప్రధాని కావాలని 9.2 శాతం మంది మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఏడాది పూర్తికాకముందే ప్రధాని అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాహుల్ తర్వాత ప్రధాని అభ్యర్ధిగా జనం విజయ్ను ఎంచుకున్నారు. నాలుగో స్థానంలో మమతా బెనర్జీ 2 శాతం, అఖిలేష్ యాదవ్ 1.7 శాతం, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే 1.3 శాతం, అరవింద్ కేజ్రీవాల్ 1.2 శాతంతో వరసగా ప్రధాని రేసులో ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్‌ను జనం పట్టించుకోలేదు. ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో...పవర్ స్టార్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్‌కు...ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. అంతేకాకుండా సామాజిక సమీకరణాలు ఉన్నప్పటికీ...ప్రధాని రేసులోకి మాత్రం రాలేకపోయారు. రేటింగ్స్లోనే కాదు...ర్యాంకింగ్స్‌లోనూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చోటు సంపాదించలేకపోయారు. ఆయనకున్న ఫాలోయింగ్ నీటి మీద బుడగలాంటిదేనని తాజా సర్వేలో తేలిపోయింది. పవన్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌కి రోజురోజుకు జనం మద్దతు పెరుగుతూనే ఉంది.
సనాతన ధర్మం అని చెప్పుకున్నా...హిందు ధర్మం కోసం పాటు పడుతానని చెప్పినా పవన్ కల్యాణ్‌ను జనం నమ్మలేదు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలుస్తాడన్న నమ్మకం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రధానిగా పవన్ కల్యాణ్ పేరును ఎలా ప్రతిపాదిస్తామని ప్రశ్నిస్తున్నారు. అయితే 2029 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. సర్వేలో వ్యక్తమైన ప్రజాదరణను దేశవ్యాప్తంగా ఓట్లుగా, కూటమిగా మార్చుకోవడం విజయ్‌కు పెద్ద సవాలే. అయినప్పటికీ.. తమిళనాడు రాజకీయాలకే పరిమితమైన నాయకుడిగా కాకుండా, జాతీయ స్థాయిలో ప్రధాని రేసులో పేరు వినిపించే స్థాయికి విజయ్ చేరుకోవడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతో మంది తలపండిన రాజకీయ నేతలు ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగుసార్లు సీఎంగా పని చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. అలాగే కర్ణాటక సీఎం డీకే శివకుమార్...మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ...ఆ పేరు కూడా సర్వేలో పెద్దగా ప్రస్తావించలేదు. మాజీ సీఎంలు కేసీఆర్, సిద్ధరామయ్య, జగన్, స్టాలిన్ పేర్లు అయితే నామరూపాల్లేవ్. అయితే పార్టీ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే తమిళనాడు సీఎంగా గెలిచి, రాజకీయ రంగంలోనే చరిత్ర సృష్టించారు విజయ్. ఇప్పుడు 2029 ప్రధాని అభ్యర్థిగా విజయ్ను టీవీకే ప్రొజెక్ట్ చేస్తోంది. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో విజయ్ కేవలం తదుపరి ప్రధానమంత్రి ఎవరనే ప్రశ్నకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించే నేతల్లోనూ విజయ్ సంచలనం సృష్టించారు. ప్రతిపక్ష నాయకుడి రాహుల్ గాంధీ తొలిస్థానంలో 29 శాతం మద్దతుతో ఉంటే, రెండో స్థానంలో విజయ్ 12.2 శాతంతో ఉన్నారు. మమతా బెనర్జీ 8.5 శాతం, అరవింద్ కేజ్రీవాల్ 7.5 శాతం, అఖిలేష్ యాదవ్ 6.9 శాతం కంటే ముందున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తికాకముందే ప్రధాని అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.