Top story: అక్కడ దోస్తీ-ఇక్కడ కుస్తీ తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు లేకపోవడానికి కారణం ఇదే..!

ఆంధ్రప్రదేశ్‌లోనూ, కేంద్రంలోనూ భుజం భుజం కలిపి నడుస్తున్న బీజేపీ, జనసేనల మధ్య తెలంగాణ రాజకీయాల్లో మాత్రం తీవ్ర విభేదాలు పొడచూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీల మధ్య స్నేహం వికసిస్తుంటే, తెలంగాణకు వచ్చేసరికి అది కాస్తా రాజకీయం

Post Published By: dialnews
Updated : 11 August 2026, 9:16 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోనూ, కేంద్రంలోనూ భుజం భుజం కలిపి నడుస్తున్న బీజేపీ, జనసేనల మధ్య తెలంగాణ రాజకీయాల్లో మాత్రం తీవ్ర విభేదాలు పొడచూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీల మధ్య స్నేహం వికసిస్తుంటే, తెలంగాణకు వచ్చేసరికి అది కాస్తా రాజకీయం కాకరేపే ‘కుస్తీ’గా మారిపోయింది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, పొత్తుల వ్యవహారంపై ఇరు పార్టీల నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధం తెలంగాణ రాజకీయాన్ని తీవ్ర వేడెక్కిస్తోంది. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువని తెలంగాణ బీజేపీ నాయకత్వం బలంగా భావిస్తోంది.

పొత్తు నిర్ణయం తీసుకోవాల్సింది జాతీయ నాయకత్వమే తప్ప, స్థానిక నేతల పరిధిలోనిది కాదని తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ బీజేపీ తమతో కలిసి రాకపోతే, తాము కూడా తెలంగాణలో ఒంటరిగానే పోటీకి సిద్ధమవుతామని ప్రకటించారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. తెలంగాణ బీజేపీ నేతలు జనసేనతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజల్లో జనసేనను ఇప్పటికీ ఒక ఆంధ్రప్రదేశ్ ప్రాతిపదికగల పార్టీగానే చూస్తున్నారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లో తీవ్ర అగ్రహాన్ని కలిగించాయి. "తెలంగాణ మీ అయ్య జాగీరా?" అంటూ పవన్ చేసిన కామెంట్లు తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చాయి.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ వంటి ప్రధాన రాజకీయ పక్షాలు పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో జనసేనతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ సమాజం తమకు కూడా దూరమవుతుందని, తెలంగాణ బీజేపీ సొంత రాజకీయ ఉనికికి గండిపడుతుందని కాషాయ నేతలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలు, గ్రేటర్ పరిధిలో ఆంధ్ర మూలాలున్న ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు రాజకీయం రసవత్తరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలో ఉండటం, తెలుగుదేశం పార్టీతో కలసి పనిచేస్తుండటంతో, గ్రేటర్‌లోని సెట్లర్ల ఓట్లు తమకే పడతాయని జనసేన భావిస్తోంది. అయితే, ఈ పరిస్థితిని ముందే గ్రహించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెట్లర్ ఓటర్లకు దగ్గరయ్యేందుకు వేగంగా పావులు కదిపారు.

హైదరాబాద్ నగరం నడిబొడ్డున దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ఆంధ్ర సంఘాల ప్రతినిధులతో నిరంతరం సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా సెట్లర్ల ఆదరణ పొందేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. వైఎస్‌ఆర్ హయాం మినహా, ఆ తర్వాత నగరంలోని శివారు ప్రాంతాల్లోని ఆంధ్ర ఓటర్లు యాంటీ-కాంగ్రెస్‌గా ఉన్నారనే విషయాన్ని అధ్యయనం చేసిన రేవంత్ రెడ్డి, ఆ ఇమేజ్‌ను చెరిపేసి వారిని కాంగ్రెస్ వైపు తిప్పుకునే వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఒకవేళ బీజేపీ, జనసేనలు వేర్వేరుగా ఒంటరిగా పోటీ చేస్తే, ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో జనసేనకు, పవన్ కళ్యాణ్‌కు గణనీయమైన సంఖ్యలోనే అభిమానులు, మద్దతుదారులు ఉన్నారు. అయితే ఇది బలమైన పార్టీ నిర్మాణంగా మారకపోవడం వల్ల ఈ ఓట్లు స్వతంత్రంగా ఓటు బ్యాంకును చీల్చవచ్చు. జనసేన, బీజేపీలు విడివిడిగా పోటీ చేస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఇది ఏ పార్టీకి ప్లస్ అవుతుంది, ఎవరికి డ్యామేజ్ చేస్తుందనేది ఓటర్ల తీర్పుపై ఆధారపడి ఉంటుంది. జాతీయ స్థాయిలో బీజేపీ-జనసేనల మధ్య మంచి మైత్రి ఉన్నప్పటికీ, తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం "మా సొంత బలం మీదే మేము నిలబడతాం, ఆంధ్ర రాజకీయాల నీడ మాపై పడనివ్వం" అని స్పష్టం చేస్తున్నారు. పొత్తు ఉంటే తెలంగాణలో సొంత బలం లేకే పొత్తు పెట్టుకున్నారనే నింద పడుతుందని బీజేపీ భయపడుతోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందో లేక తెగుతుందో తెలియాలంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Published : 
  • 11 August 2026, 9:16 AM IST