Top story: ఐదు సీట్లు ఇస్తే వచ్చేస్తాం… బీజేపీకి మల్లారెడ్డి డిమాండ్లు…!

మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ నేత మల్లారెడ్డి ఫ్యామిలీ...కాషాయ పార్టీ వైపు చూస్తోందా ? ఫ్యామిలీ మొత్తానికి సీట్లు కావాలని...బీజేపీ ముందు డిమాండ్‌ పెట్టారా ? బీఆర్ఎస్‌లో ఉంటే రాజకీయ జీవితం ఉండదనే అంచనాకు వచ్చారా ? బీజేపీ తరపున పోటీ చేస్తే

Post Published By: dialnews
Updated : 28 April 2026, 1:52 PM IST

మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ నేత మల్లారెడ్డి ఫ్యామిలీ...కాషాయ పార్టీ వైపు చూస్తోందా ? ఫ్యామిలీ మొత్తానికి సీట్లు కావాలని...బీజేపీ ముందు డిమాండ్‌ పెట్టారా ? బీఆర్ఎస్‌లో ఉంటే రాజకీయ జీవితం ఉండదనే అంచనాకు వచ్చారా ? బీజేపీ తరపున పోటీ చేస్తే...తన ఆస్తులకు ఇబ్బంది ఉండదని ఫిక్సయ్యారా ? మల్లారెడ్డి ఫ్యామిలీ ఎవరెవరికి సీట్లు ఆడిగింది ?చామకూర మల్లారెడ్డి...తెలుగు రాజకీయాల్లో ప్రత్యేకముద్ర వేసుకున్న నేత. పాలమ్మినా..పూలమ్మినా...అంటూ జనాన్ని మాటలతో ఆకట్టుకుంటారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా...ఏం చేసినా సంచలనమే. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మల్లారెడ్డి ఓటమి అన్నది లేకుండా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. తెలంగాణలో పాలిటిక్స్‌ మారుతుండటంతో...మల్లారెడ్డి అలర్ట్‌ అవుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కుటుంబానికి ఐదు సీట్లు ఇవ్వాలని కాషాయ పార్టీ ముందు డిమాండ్‌ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి...హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మల్లారెడ్డి తన ఫ్యామిలీతో కలిసి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. కోడలు ప్రీతిరెడ్డికి మల్కాజిగిరి ఎంపీ సీటు, తనకు, అల్లుడు, కొడుకుకు అసెంబ్లీ సీట్లు.. మొత్తంగా ఐదు టికెట్లు ఇవ్వాలని ప్రతిపాదన పెట్టినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తాము అడిగినట్లు టికెట్లు ఇస్తే మల్కాజి‌గిరి ఎంపీతో పాటు ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఖర్చు తానే భరిస్తానని మల్లారెడ్డి కమలం నేతలకు ఆఫర్ ఇచ్చారట. ఈ ప్రతిపాదనకు కమలనాథుల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బీజేపీలో చేరికకు మల్లారెడ్డి ఫ్యామిలీ వేగంగా పావులు కదుపుతోంది. ఆస్తులు కాపాడుకోవడం, తమ ఆస్తులపై ఈడీ, సీబీఐ దాడులు జరగకుండా ఉండటానికే మల్లారెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కొడుకు, కోడలితో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు మల్లారెడ్డి. ఆ తర్వాత మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి నేరుగా బీజేపీ ఆఫీసుకు వెళ్లడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అక్కడ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ తివారీని కలవడంతో పార్టీ మార్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. విద్యాసంస్థలు, వ్యాపారాలు ఉన్న వారు, ఒక రాజకీయ పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు మరొక పార్టీ కార్యాలయానికి వెళ్లడం అంత ఆషామాషీ వ్యవహారం కాదంటున్నారు. అంతేకాకుండా మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరుతోందన్న ప్రచారం అప్పటి నుంచే సాగుతోంది. కమలం పార్టీ కీలక నేతల సహకారంతో మల్లారెడ్డి...అగ్ర నాయకులకు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి కుటుంబం చేరికకు అగ్రనాయకత్వం సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఫ్యామిలీ...కాషాయ పార్టీ నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీలో చేరిక అంశాన్ని మల్లారెడ్డి కుటుంబం మాత్రం ఖండిస్తోంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ప్రధాని అపాయింట్‌మెంట్ దొరకడం, ఆ తర్వాత కోడలు బీజేపీ ఆఫీసుకు వెళ్లడం వెనక చాలా మతలబు ఉందని కమలం పార్టీ నేతలే చెబుతున్నారు. ఏదైనా కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని ఆహ్వానిస్తారని అంటున్నారు. కానీ మల్లారెడ్డి కోడల్ని...బీజేపీ నేతలు ఆమె ఆఫీసుకు వెళ్లి ఆహ్వానించడం మాములు విషయం కాదు. ప్రీతిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని...బీజేపీలో చేరుతారనే ఆ పార్టీ నేతలు బలగుద్ది చెబుతున్నారు. అన్ని రకాలుగా లెక్కలు వేసుకున్నాకనే బీజేపీ నేతలు మల్లారెడ్డి కుటుంబానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఖర్చులు భరించడం, గెలవగలిగే సత్తా, సామాజిక కోణాలు ఉన్న నేత కావడంతో ఆయన పట్ల సానుకూలంగా ఉన్నట్టు సమాచారం.

మల్లారెడ్డి కుటుంబం ప్రస్తుతం బీఆర్ఎస్‌లోనే ఉన్నా... వారి మనసంతా కాంగ్రెస్, బీజేపీలో ఉందంటున్నారు ఆయన అనుచరులు. కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సుముఖంగా లేకపోవడంతో.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిశారు. కాంగ్రెస్‌ నుంచి టికెట్లు సంపాదించేందుకు మల్లారెడ్డి ప్రయత్నించి విఫలమయ్యారు. రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కాంగ్రెస్‌లో ఎంట్రీ కష్టమని భావించి.. బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.ఇప్పటికే విద్యాసంస్థలను నడుపుతున్న మల్లారెడ్డి.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా ఒకే సారి 18 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని నిర్ణయించారు. వీటి కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారని తెలిసింది.

Published : 
  • 28 April 2026, 1:52 PM IST