కీలక ప్రాజెక్టు కోసం బంగ్లాదేశ్‌పై చైనా ఒత్తిడి తెస్తుందా? భారత్‌ను లక్ష్యం చేసుకోడానికి బంగాళాఖాతంలోకి ఈజీగా చొరబడటానికి బీజింగ్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందా? ఒకప్పుడు భారత్‌ను కలుపుకొని ప్లాన్ చేసిన ఎకనామిక్ కారిడార్‌ను ఇప్పుడు అదే భారత్‌కు వ్యతిరేకంగా రీప్లాన్ చేస్తోందా? ప్రస్తుత పరిణామాలు ఔననే చెబుతున్నాయి. సరిగ్గా 15 ఏళ్ల క్రితం కున్మింగ్ నుండి కోల్‌కతా వరకు బంగ్లా, చైనా, ఇండియా, మయన్మార్ ఎకనామిక్ కారిడార్ పేరుతో ఒక ప్లాన్ తెచ్చారు. కానీ చైనా దురాక్రమణ బుద్ధిని ముందే పసిగట్టిన భారత్.. ఆ ప్రాజెక్ట్ పూర్తిగా పక్కనబెట్టింది. ఇప్పుడు, అదే ప్లాన్‌ను భారత్‌పై తిరుగులేని అస్త్రంగా సింధిస్తోంది బీజింగ్. అదే చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ ఎకనామిక్ కారిడార్ చైనా, మయన్మార్, బంగ్లాదేశ్‌లతో సరికొత్త కారిడార్‌ను బీజింగ్ తెరపైకి తెచ్చింది.
చైనాలోని యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్ నుండి ప్రారంభమయ్యే ఈ కారిడార్.. మయన్మార్‌లోని మండలే గుండా రఖైన్ రాష్ట్రంలోని 'క్యౌక్ప్యు' లోతైన సముద్ర ఓడరేవుకు చేరుకుంటుంది. అక్కడితో ఆగకుండా దీనిని బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్, చిట్టగాంగ్ ఓడరేవుల వరకు విస్తరించాలనేది జిన్‌పింగ్ ప్లాన్. ఇది గనుక పూర్తయితే, భారత్ అడ్డాలోని మలక్కా జలసంధిపై ఆధారపడకుండా చైనాకి నేరుగా హిందూ మహాసముద్రంలోకి, బంగాళాఖాతంలోకి రోడ్డు, రైలు మార్గాలు దొరుకుతాయి. అయితే, చైనా ప్రతిపాదనపై బంగ్లాదేశ్ ప్రస్తుతానికి అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఢాకా విదేశాంగ మంత్రి ఖలీలూర్ రెహమాన్ స్పష్టం చేసిన దాని ప్రకారం.. బంగ్లాదేశ్ దీనిని పరిశీలిస్తోందే తప్ప ఎలాంటి ఒప్పందాలూ చేసుకోలేదు. ముఖ్యంగా మయన్మార్ రఖైన్ ప్రాంతంలో శాంతి నెలకొంటేనే భూమార్గం గురించి ఆలోచిస్తామని ఢాకా చెబుతోంది. శ్రీలంక, పాకిస్తాన్‌లు చైనా అప్పుల ఊబిలో చిక్కుకున్న తీరు చూశాక, బంగ్లాదేశ్ అంత తేలిగ్గా డ్రాగన్ ట్రాప్‌లో పడేలా కనిపించడం లేదు. కాదని చైనాను నమ్మితే నాశనమయ్యేది ఢాకానే.
ఇక చైనా ప్లాన్ వెనుక వ్యూహం ఏంటన్న విషయానికొస్తే.. ఇది చైనా కొత్త స్ట్రాటజీ ఏమీ కాదు. భారత్‌ను చుట్టుముట్టాలన్న పాత 'స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహంలో భాగమే. పశ్చిమాన పాకిస్తాన్లో సీపెక్ ప్రాజెక్ట్ ద్వారా అరేబియా సముద్రంలోని గ్వాదర్ పోర్టును చైనా తన చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు తూర్పున CMBCద్వారా బంగాళాఖాతంలో పట్టు సాధించాలని చూస్తోంది. అంటే భారత్‌కు ఇరువైపులా చైనా సైనిక, వాణిజ్య స్థావరాలు ఏర్పడతాయి. ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు అత్యంత కీలకమైన సవాలు. అయితే, న్యూఢిల్లీ కూడా చేతులు కట్టుకుని కూర్చోలేదు. చైనా కదలికలను గమనిస్తున్న భారత్, తన 'యాక్ట్ ఈస్ట్ విధానాన్ని మరింత వేగవంతం చేసింది. చైనా కంటే ముందే మయన్మార్‌లో భద్రతను బలోపేతం చేయడానికి భారత్ 'కలదాన్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది.
ఇది కోల్‌కతాను మయన్మార్‌లోని సిట్వే పోర్టుతో కలుపుతూ, అక్కడ నుండి మిజోరాం వరకు వెళ్తుంది. చైనాకు కౌంటర్‌గా సిట్వే పోర్టులో భారత్ తన పట్టును నిలుపుకుంటోంది.మరోవైపు.. బంగాళాఖాతంలో చైనా చొరబాట్లను అడ్డుకోవడానికి భారత్ 'సాగరమాల ప్రాజెక్ట్ ద్వారా తన సొంత తీరప్రాంత ఓడరేవులను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఆధునికీకరిస్తోంది. అండమాన్ నికోబార్ దీవులను కేవలం పర్యాటక కేంద్రంగానే కాకుండా, వ్యూహాత్మక సైనిక కంచుకోటగా మార్చింది. బంగాళాఖాతంలోకి ప్రవేశించే ఏ చైనా యుద్ధనౌక అయినా అండమాన్ కమాండ్ కంటికి చిక్కాల్సిందే. ఇక చైనా బంగ్లాదేశ్‌ను ఎంత లొంగదీసుకోవాలని చూసినా, భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలు చైనాకు పెద్ద అడ్డుగోడగా నిలుస్తాయని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బంగ్లా పాలకులు భారత వ్యతిరేకతతో రెచ్చిపోతున్న సంగతి నిజమే. కానీ, బంగ్లాదేశ్‌కు అవసరమైన విద్యుత్, వాణిజ్యం, కనెక్టివిటీలో భారత్ ఇప్పటికే పెద్ద భాగస్వామిగా ఉంది. కాబట్టి అంత తేలిగ్గా భారత్‌కు విరుద్ధంగా వ్యవహరించే ధైర్యం వాళ్లు చేయకపోవచ్చని చెబ్తున్నారు.
పైగా పొరుగు దేశాలు చైనా వైపు పూర్తి స్థాయిలో వెళ్లకుండా ఆర్థిక సాయం అందించడంలో న్యూఢిల్లీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
వాస్తవానికి.. సముద్ర భద్రత విషయంలో భారత్ ఒంటరిగా లేదు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన 'క్వాడ్ కూటమి ద్వారా ఇండో-పసిఫిక్‌లో చైనా ఏకపక్ష ఆధిపత్యాన్ని భారత్ చాలా సమర్థవంతంగా అడ్డుకుంటోంది. బంగాళాఖాతంలో చైనా నేవీ కదలికలపై నిఘా ఉంచడానికి క్వాడ్ దేశాల శాటిలైట్, ఇంటెలిజెన్స్ సమాచారం భారత్‌కు ఎప్పటికప్పుడు అందుతోంది. చైనా ప్రతిపాదిస్తున్న చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ కారిడార్ కాగితం మీద చాలా బలంగా కనిపిస్తున్నా, గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. మయన్మార్ అంతర్యుద్ధం, బంగ్లాదేశ్ అప్రమత్తత చైనాకు అంత సులభమైన దారిని ఇవ్వవు. డ్రాగన్ విసురుతున్న ఈ తూర్పు సవాలును భారత్ తన దౌత్యనీతితో, రక్షణ వ్యూహాలతో, పొరుగు దేశాలతో ఉన్న బలమైన సంబంధాలతో తిప్పికొట్టడానికి సర్వసన్నద్ధంగా ఉంది.