ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని దృశ్యం.. ఎప్పుడూ తన ప్రత్యర్థులపై విరుచుకుపడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన అతిపెద్ద వాణిజ్య శత్రువు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు స్వయంగా ఫోన్ చేశారు. ఇది కేవలం పలకరింపు కాదు, ఇరాన్‌ను ఒప్పించమని చేసిన ఒక పక్కా బ్రతిమాలడం. ఇరాన్‌ను ఒంటరి చేయాలని, వారిని శాంతి చర్చలకు తీసుకురావాలని ట్రంప్ చైనా సాయం కోరుతున్నాడు. కానీ చైనా మౌనం ఇప్పుడు వైట్ హౌస్‌ను కలవరపెడుతోంది. ట్రంప్‌కు యుద్ధం ఆపే మార్గం కనిపించడం లేదా..? లేక ఇది తుపానుకు ముందు ప్రశాంతతా..?
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా ఏప్రిల్ 11-12 తేదీల్లో ఒక చారిత్రక ఘట్టం జరిగింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జె.డి.వాన్స్, ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధులు ముఖాముఖి కూర్చున్నారు. ఏకంగా 21 గంటల పాటు మారథాన్ చర్చలు జరిగాయి. ఇక్కడ ప్రధాన అడ్డంకి.. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి ససేమిరా అంది. 'ఇరాన్ మా నిబంధనలను అంగీకరించలేదు' అని చెబుతూ జె.డి.వాన్స్ ఆదివారం సాయంత్రం ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోయారు. ఈ చర్చల విఫలం అంటే.. ఇక ఆయుధాలదే మాట అని ప్రపంచానికి స్పష్టమైపోయింది.
చర్చలు ఫలించకపోవడంతో ట్రంప్ తన అసలు విశ్వరూపం చూపించారు. 'టెహ్రాన్ మా మాట వినడం లేదు, ఇక యుద్ధమే సమాధానం' అన్నట్లుగా అమెరికా నేవీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 13 ఉదయం నుంచి ఇరాన్ ఓడరేవులను అమెరికా నౌకాదళం దిగ్బంధించడం మొదలుపెట్టింది. హార్ముజ్ జలసంధిలో ఎవరైనా అమెరికా నౌకలపై దాడి చేస్తే వారిని 'బ్లోన్ టు హెల్' అని ట్రంప్ నేరుగా హెచ్చరించారు. ట్రంప్ ఇప్పుడు ఎవరి మాటా వినే స్థితిలో లేరు, యుద్ధం తప్పదని ఆయన ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి.
అమెరికా హెచ్చరికలకు ఇరాన్ ఏమాత్రం భయపడటం లేదు. సరికదా, వారు గ్రౌండ్ లెవల్లో భారీ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇరాన్ ఆర్మీ తన రహస్య బేస్‌ల నుంచి మిస్సైల్స్‌ను యాక్టివేట్ చేసింది. 'అమెరికా పైరసీకి పాల్పడుతోంది, మేము గట్టిగా సమాధానం ఇస్తాం' అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. మరోవైపు చైనా ఇరాన్‌కు రహస్యంగా 'మ్యాన్‌ప్యాడ్స్' వంటి అధునాతన వాయు రక్షణ వ్యవస్థలను సరఫరా చేస్తోందని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ఇది యుద్ధాన్ని మరింత సంక్లిష్టంగా మార్చబోతోందనే భయం గల్ఫ్ లో ఉంది.
ఇలాంటి టైంలో ఏం చేయాలో తెలియక.. ట్రంప్, చైనాకు ఫోన్ చేసాడు. అసలు చైనాకే ఎందుకు చేసాడు..? ఇరాన్ ఎగుమతి చేసే చమురులో దాదాపు 80% నుండి 90% వరకు ఒక్క చైనా మాత్రమే కొనుగోలు చేస్తోంది. అమెరికా ఆంక్షల వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇరాన్ చమురును కొనడానికి భయపడినా, చైనా మాత్రం రోజుకు యావరేజ్ న 1.4 మిలియన్ బారెల్స్ దిగుమతి చేసుకుంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, చైనా గనుక చమురు కొనడం ఆపేస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ క్షణాల్లో కుప్పకూలుతుంది. ఈ "ఎకనామిక్ వీక్నెస్" వల్లే చైనా చెబితే ఇరాన్ వింటుందని ట్రంప్ భావించారు.
ఇరాన్ మరియు చైనా మధ్య 2021లో కుదిరిన 400 బిలియన్ డాలర్ల, భారీ ఒప్పందం వీరి బంధాన్ని మరింత గట్టి చేసింది. చమురు, బ్యాంకింగ్, రైల్వేలు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇరాన్ మనుగడకు ఇంతటి భారీ ఆర్థిక మద్దతు ఇస్తున్న దేశం మరొకటి లేదు. అందుకే ఈ 'బిగ్ బ్రదర్' పాత్రను ఉపయోగించుకుని యుద్ధాన్ని ఆపమని ట్రంప్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కోరారు. చైనా కేవలం ఇరాన్ నుంచే కాకుండా, హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చే ఇతర గల్ఫ్ దేశాల చమురు మీద కూడా భారీగా ఆధారపడింది.
యుద్ధం తీవ్రమైతే చమురు ధరలు పెరిగి చైనా ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తగులుతుంది. అందుకే తన సొంత లాభం కోసమైనా చైనా ఇరాన్‌ను నియంత్రిస్తుందని ట్రంప్ అంచనా వేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత వారం ఒక తాత్కాలిక రెండు వారాల కాల్పుల విరమణ కుదర్చడంలో చైనా తన వంతు పాత్ర పోషించిందని టాక్. ఇరాన్.. చైనా చెప్తేనే ఒప్పుకుందని టాక్ కూడా. ట్రంప్ భయం కేవలం యుద్ధం గురించి మాత్రమే కాదు, చైనా నుండి ఇరాన్‌కు అందుతున్న మిస్సైల్ టెక్నాలజీ మరియు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి కూడా.
చైనా గనుక ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం ఆపేస్తానని బెదిరిస్తే, ఇరాన్ ఖచ్చితంగా వెనక్కి తగ్గుతుందని ట్రంప్ నమ్మకం. అందుకే ట్రంప్, చైనాకు ఫోన్ చేసి "ఒప్పించమని" బ్రతిమాలడమే కాకుండా, ఒకవేళ ఇరాన్‌కు సైనిక సాయం చేస్తే చైనాపై 50% టారిఫ్ విధిస్తానని హెచ్చరించారు. ఇరాన్‌ను ఒప్పిస్తే, గతంలో విధించిన ఇతర వాణిజ్య ఆంక్షలను సడలిస్తామనే సంకేతాలు ఇచ్చారు. ట్రంప్ లెక్క ప్రకారం, ఇరాన్‌కు 'డబ్బు' మరియు 'ఆయుధాలు' ఇచ్చే ఏకైక మూలం చైనా. ఆ మూలాన్ని కదిలిస్తే ఇరాన్ తోక ముడుస్తుందని ఆయన ప్లాన్. కానీ ఇస్లామాబాద్ చర్చల విఫలం తర్వాత, చైనా ఇరాన్‌కు రహస్యంగా సాయం చేస్తోందన్న వార్తలు ట్రంప్‌కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. వెస్ట్రన్ దేశాల మాట వినని ఇరాన్, తన ప్రధాన పెట్టుబడిదారు అయిన చైనా మాటను కాదనలేదని ట్రంప్ భావన.