Top story: ర్యాలీల నుంచి రీల్స్‌ వైపు మళ్లుతున్న పాలిటిక్స్‌..!

ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే ఊరూరా భారీ బహిరంగ సభలు, రోడ్‌షోలు, వీధి గోడలపై పోస్టర్లు, కరపత్రాలు, టీవీల్లో చర్చలు ఉండేవి. కానీ, ఈ డిజిటల్ యుగంలో రాజకీయం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

Post Published By: dialnews
Updated : 11 August 2026, 10:15 AM IST

ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే ఊరూరా భారీ బహిరంగ సభలు, రోడ్‌షోలు, వీధి గోడలపై పోస్టర్లు, కరపత్రాలు, టీవీల్లో చర్చలు ఉండేవి. కానీ, ఈ డిజిటల్ యుగంలో రాజకీయం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఓటర్లను ఆకట్టుకోవడానికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు అక్కర్లేదు.. 30 నుండి 60 సెకన్ల ఇన్‌స్టాగ్రామ్ రీల్ లేదంటే యూట్యూబ్ షార్ట్ ఉంటే చాలు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్న ప్రతిఒక్కరి స్క్రీన్‌పై రోజుకు వందల సంఖ్యలో రీల్స్ ప్రత్యక్షమవుతున్నాయి. ఈ చిన్న వీడియోలే నేడు దేశాధినేతల భవిష్యత్తును, ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.ఈ రీల్స్ ట్రెండ్ ఇప్పుడు ఎన్నికలను శాసిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే ట్రెంట్‌ కొనసాగుతోంది. టీవీ ఛానెళ్లు, న్యూస్‌ పేపర్ల కంటే ఇప్పుడు షార్ట్ వీడియోలకు ఉన్న శక్తి వేరు. దీనికి ప్రధాన కారణం ఇవి యువతను నేరుగా చేరుకోవడం. ఈ కాలం యువత సుదీర్ఘ రాజకీయ విశ్లేషణలు చూడటానికి ఆసక్తి చూపడం లేదు. స్క్రోల్ చేస్తూ క్షణాల్లో చూసే రీల్స్ ద్వారా రాజకీయ విషయాలను తెలుసుకుంటున్నారు. పొలిటికల్ రీల్స్ ముఖ్యంగా ఎమోషన్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పంచ్ డైలాగ్‌లపై ఆధారపడి పనిచేస్తాయి. ఇవి నెటిజన్ల మైండ్‌లో వేగంగా నాటుకుపోతాయి. నేరుగా నేతలే మాట్లాడటం కంటే, లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల ద్వారా పార్టీలు తమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.

నెటిజన్‌ ఏ రకమైన కంటెంట్ ఎక్కువసేపు చూస్తున్నారో గ్రహించే అల్గారిథమ్, అలాంటి రాజకీయ రీల్స్‌నే వారి స్క్రీన్‌పై మళ్లీ మళ్లీ వచ్చేలా చేస్తుంది. 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ మీడియా ఒక ప్రధాన యుద్ధ రంగంగా మారింది. దేశంలో దాదాపు 1.85 కోట్ల మంది తొలిసారిగా ఓటు వేసిన యువ ఓటర్లు ఉండటంతో, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు 'డిజిటల్ వార్ రూమ్స్' ఏర్పాటు చేశాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మరియు ఇతర ప్రాంతీయ పార్టీలు తమ మేనిఫెస్టోలను, ప్రత్యర్థులపై విమర్శలను చిన్న చిన్న రీల్స్ రూపంలో మార్చి వైరల్ చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టాప్ డిజిటల్ క్రియేటర్లను కలవడం, మరోవైపు రాహుల్ గాంధీ, ఇతర నేతలు యూట్యూబర్లు మరియు పాడ్‌కాస్టర్లతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ వీడియోల క్లిప్‌లు రీల్స్‌గా మారి కోట్లాది వ్యూస్ సాధించాయి.

మన దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో ఈ రీల్స్‌ ఇప్పుడు బలమైన ఆయుధంగా మారాయి. రీల్స్, షార్ట్‌ వీడియోలు ఒక నాయకుడి ఇమేజ్‌ను ఎలా తిరగరాయగలవో చెప్పడానికి ఇండోనేషియా ఎన్నికలే అతిపెద్ద ఉదాహరణ. గతంలో కఠినమైన మిలిటరీ జనరల్‌గా, వివాదాస్పదమైన చరిత్ర కలిగిన ప్రభోవో సుబియాంటో అనే నాయకుడు టిక్‌టాక్ రీల్స్ ద్వారా తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ఆయన సరదాగా డాన్స్ చేస్తున్న వీడియోలు, AI యానిమేషన్ క్యారెక్టర్లు, డాన్స్ ఛాలెంజ్‌లు టిక్‌టాక్‌లో విపరీతంగా వైరల్ అయ్యాయి. దాంతో యువత ఆయనను ఓ క్యూట్, 'ముద్దుల తాత'లా భావించింది. ఫలితంగా యువ ఓటర్ల మద్దతుతో ఆయన ఘనవిజయం సాధించారు. అమెరికా రాజకీయాల్లోనూ షార్ట్ వీడియోల జోరు నడుస్తోంది. కమలా హారిస్ ప్రచార బృందం పాప్ కల్చర్ ట్రెండ్స్‌ను, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టిక్‌టాక్ ఆడియోలను ఉపయోగించి Gen Z ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఫిలిప్పీన్స్‌లో బొంగ్‌బొంగ్ మార్కోస్ తన కుటుంబ గత చరిత్రను, నియంతృత్వ కాలాన్ని మరుగున పరుస్తూ, అభివృద్ధి చెందిన కాలంగా చిత్రీకరిస్తూ వేలకొద్దీ టిక్‌టాక్ రీల్స్ ద్వారా ప్రచారం చేసి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు.

అయితే ఈ రీల్స్ పాలిటిక్స్ వెనుక అంతే ముప్పు కూడా ఉంది. రీల్స్ ప్రచారం సులభంగా ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ, దీనివల్ల కొన్ని తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా డీప్‌ఫేక్స్, AI దుర్వినియోగం. AI సాయంతో నేతలు మాట్లాడని మాటలను మాట్లాడినట్లుగా, చేయని పనులను చేసినట్లుగా నకిలీ వీడియోలు సృష్టించి రీల్స్‌ రూపంలో వైరల్ చేస్తున్నారు. అంతే కాకుండా 30 సెకన్ల వీడియోలో దేశ సమస్యలు, పాలసీలు, ఆర్థిక వ్యవస్థ గురించిన చర్చ సరిగ్గా జరగదు. కేవలం ఉద్వేగాలు, ఆరోపణలు, హడావుడి మాత్రమే ప్రధానం అవుతున్నాయి. సత్యసందర్భాలను సరిచూసుకోకుండా అబద్ధపు సమాచారాన్ని ఆకర్షణీయమైన రీల్స్‌గా మలచడం వల్ల ప్రజలు తప్పుడు అభిప్రాయాలకు గురవుతున్నారు. ఇవి మినహా.. రాబోయే రోజుల్లో రాజకీయ విజయాలను శాసించడంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్ మరింత కీలకం కానున్నాయి. రాజకీయ పార్టీలకు ఇదొక శక్తివంతమైన ఆయుధంగా మారింది.

 

Published : 
  • 11 August 2026, 10:15 AM IST