హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ పార్టీ వెనుక 'దుబాయ్ పంచాయితీ' అనే కోణం ఈ కేసును వేరే లెవెల్ కు తీసుకువెళ్ళింది. మార్చి 14న అంటే శనివారం రాత్రి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌పై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో కొకైన్ వంటి మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు, గాలిలోకి కాల్పులు జరగడం కలకలం రేపింది.
ఈ పార్టీ కేవలం వినోదం కోసం జరిగింది కాదని, దుబాయ్‌లోని ఆస్తులు మరియు పెట్టుబడుల చుట్టూ ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి జరిగిన ఒక "రియల్ ఎస్టేట్ పంచాయితీ" అని ప్రచారం జరుగుతోంది. గతంలో దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సహకరించిన 'కేదార్' అనే ఇన్వెస్టర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు తమ అక్రమ సంపాదనను హవాలా మార్గంలో దుబాయ్‌కు మళ్లించి, అక్కడ కేదార్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కేదార్ మరణం తర్వాత, దుబాయ్‌లో పెట్టిన భారీ పెట్టుబడులు మరియు ఆస్తుల పంపకాలపై వివాదాలు నెలకొన్నాయి. ఆయన మరణం తర్వాత దుబాయ్‌లో ఉన్న సుమారు 1,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, భూములు మరియు షేర్ల పంపకంలో వీరి మధ్య క్లారిటీ మిస్ అయినట్లు తెలుస్తోంది. కేదార్ మరణం తర్వాత ఆ ఆస్తుల యాజమాన్య హక్కులపై స్పష్టత లేకపోవడంతో, వాటిని పంచుకోవడానికి ఈ డ్రగ్స్ పార్టీ ఎరేంజ్ చేసినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. దుబాయ్‌లోని భూములు, విలాసవంతమైన విల్లాలు మరియు వ్యాపార వాటాలను ఎవరెవరు ఎంత తీసుకోవాలనే దానిపై ఇక్కడ డిస్కషన్ జరిగినట్లు టాక్.
ఈ వివాదాలను సాల్వ్ చేసుకోవడానికే, లాయర్లతో సహా కీలక వ్యక్తులు ఈ ఫామ్‌హౌస్‌లో సమావేశమైనట్లు పోలీస్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ, అడ్వకేట్ కౌశిక్ రవి, మరో ఆరుగురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ పంచాయితీలో పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న 11 మందికి పరీక్షలు నిర్వహించగా, రోహిత్ రెడ్డి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. పోలీసుల తనిఖీ సమయంలో నమిత్ శర్మ అనే వ్యక్తి ఒక రౌండు కాల్పులు జరిపాడు.
ఆ సమయంలో ఉపయోగించిన తుపాకీ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ సోదాల సమయంలో రోహిత్ రెడ్డి పీఏ రెండు ఐఫోన్లను పగలగొట్టడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రవణ్ రెండు ఐఫోన్లను ధ్వంసం చేయడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం, ఆ ఫోన్లలో దుబాయ్ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, వాట్సాప్ చాట్లు మరియు ఇతర కీలక సాక్ష్యాలు, లావాదేవీల వివరాలను దాచడమేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ 'దుబాయ్ పంచాయితీ' వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఆ 1,000 కోట్ల ఆస్తులు ఎవరివి? అనే యాంగిల్ లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఈ కేసులో మరికొందరు రాజకీయ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. కేవలం స్థానిక డ్రగ్స్ వాడకమే కాకుండా, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు మరియు విదేశీ పెట్టుబడుల కోణంలో ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించాయి. ఈ 'దుబాయ్ కనెక్షన్' ఈ కేసును మరింత జటిలం చేస్తోంది. ఆ సమాచారం ముందే ప్రభుత్వానికి చేరినట్లు కూడా మీడియా సర్కిల్స్ లో టాక్ మొదలైంది.
ఈ ఆస్తుల లావాదేవీలకు సంబంధించి లోతైన వివరాల కోసం పోలీసులు నిందితుల కాల్ డేటా మరియు బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నారు. కేవలం డ్రగ్స్ కేసుగానే కాకుండా, మనీలాండరింగ్ మరియు హవాలా కోణంలో కూడా విచారణ జరిపేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి పుట్టా మహేష్ యాదవ్ ను స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినా, పైలెట్ రోహిత్ రెడ్డి విషయంలోనే పోలీసులు సీరియస్ గా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులకు సంబంధించి ఆయన వద్ద కీలక ఆధారాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.