టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఏడు పరుగుల తేడాతో ఓడించింది. ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. వరుసగా రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన జట్టుగా నిలుస్తుంది. ఒకవేళ న్యూజిలాండ్ విజయం సాధిస్తే.. తొలిసారి ఆ జట్టు టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకోనుంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే ఉంది.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్ పై భారత్‌కు పేలవ రికార్డు ఉంది. ఇప్పటి వరకు రెండు జట్లు పొట్టి ప్రపంచకప్‌లో మూడు సార్లు తలపడ్డాయి. అన్ని మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఒక్క మ్యాచ్‌లోనూ భారత్ గెలవలేదు. ఇక ఓవరాల్‌గా భారత్, న్యూజిలాండ్ జట్లు టీ20ల్లో 30 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో భారత్ 16 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, 14 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ లు తలపడిన సందర్భాలు ఇవే.. తొలిసారి.. టీ20 ప్రపంచకప్ ఆరంభ ఎడిషన్‌లోనే భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మెగాటోర్నీ విజేతగా భారత్ నిలిచింది. అయితే.. ఈ టోర్నీలో భారత్ ఓడిపోయిన ఏకైక మ్యాచ్ కివీస్ చేతిలోనే కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో కివీస్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.
రెండో సారి భారత్, న్యూజిలాండ్ జట్లు టీ20 ప్రపంచకప్ 2016లో తలపడ్డాయి. సొంత గడ్డపై స్పిన్ ఉచ్చులో కివీస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి భారత్ విజేతగా నిలుస్తుందని భావించారు. అయితే.. మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీల స్పిన్ దాటికి భారత్ కుదేలైంది. 127 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 79 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది. ముచ్చటగా మూడోసారి.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్లు ముచ్చటగా మూడోసారి 2021లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు విలవిలలాడారు. చివరికి 110/7 స్కోరుకు పరిమితం అయ్యారు. ఈ మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిండి. భారత్, న్యూజిలాండ్ జట్లు టీ20 ప్రపంచకప్‌లో తలపడనుండడం ఇది నాలుగోసారి. కివీస్ అడ్డంకిని అధిగమిస్తేనే భారత్ ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడనుంది.