గెలిస్తేనే నిలిచేది…బంగ్లాతో భారత మహిళల పోరు…!

మహిళల ప్రపంచ కప్‌ను వరుసగా రెండు విజయాలతో ఆరంభించిన భారత జట్టుకు సౌతాఫ్రికా షాకిచ్చింది. ఈ ఒక్క ఓటమితో సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రస్తుత టోర్నీ నిబంధనల ప్రకారం ఒక గ్రూప్ నుంచి టాప్ లో నిలిచిన రెండు జట్లే సెమీస్ కు వెళతాయి.

Post Published By: dialnews
Updated : 25 June 2026, 10:50 AM IST

మహిళల ప్రపంచ కప్‌ను వరుసగా రెండు విజయాలతో ఆరంభించిన భారత జట్టుకు సౌతాఫ్రికా షాకిచ్చింది. ఈ ఒక్క ఓటమితో సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రస్తుత టోర్నీ నిబంధనల ప్రకారం ఒక గ్రూప్ నుంచి టాప్ లో నిలిచిన రెండు జట్లే సెమీస్ కు వెళతాయి. క్వార్టర్ ఫైనల్స్ లేదా సూపర్ సిక్స్ రౌండ్స్ మెగాటోర్నీలో లేవు. దీంతో భారత జట్టు మిగిలిన రెండు మ్యాచ్ లలో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్షితి వచ్చింది. భారత్ గ్రూప్ లో ఇప్పటికే పాక్‌, నెదర్లాండ్స్‌ ఇంటిముఖం పట్టాయి. మిగిలిన జట్లలో ఆసీస్ దాదాపుగా సెమీస్ చేరినట్టే. ఇక సౌతాఫ్రికా, భారత్ మధ్యనే మరో సెమీస్ బెర్తు కోసం పోటీ నెలకొంది. భారత్‌ మూడు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో ఉంది.

దక్షిణాఫ్రికా , బంగ్లాదేశ్‌ కూడా నాలుగేసి పాయింట్లతో ఉన్నా నెట్‌రన్‌రేట్‌ మాత్రం టీమ్‌ఇండియాదే ఎక్కువగా ఉంది.. భారత్‌ ఇంకా బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాపై ఆడాల్సి ఉంది. ఈ రెండూ గెలిస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా సెమీస్‌కు చేరుకోవచ్చు. ఒక్కటి ఓడినా.. నెట్‌రన్‌రేట్‌ కీలకమవుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడు బంగ్లాపై భారీ విజయం నమోదు చేయాలి. ప్రస్తుతం జట్టులో షెఫాలీ , స్మృతి వీరిద్దరిపైనా బ్యాటింగ్ ఎక్కువగా ఆధారపడుతోంది.ఆఖర్లో రిచా ఘోష్‌ దూకుడుతో ఫినిషింగ్ టచ్‌ ఇస్తోంది. కానీ, మిడిల్ ఆర్డర్ నుంచి ఆశించిన పరుగులు రావడం లేదు.జెమీమా రోడ్రిగ్స్‌ ఆటతీరు గొప్పగా లేదు. ఓపెనర్లు రాణించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చే జెమీమా ఆ దూకుడును కొనసాగించలేకపోతోంది. కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కూడా భారీ ఇన్నింగ్స్‌ బాకీ ఉంది. అలాగే భారత ఫీల్డింగ్ మెరుగుపడాలి.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కాప్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడవడంతో టీమ్‌ఇండియాకు ఓటమి తప్పలేదు. ఫీల్డింగ్‌లోనూ గొప్ప ప్రదర్శన చూపించకపోవడం విమర్శలకు దారితీసింది. తదుపరి మ్యాచ్‌లోనూ ఫీల్డింగ్‌ మెరుగు కాకపోతే భంగపాటు తప్పదు. ఇదిలా ఉంటే భారత్ ప్రధాన అస్త్రం స్పిన్ విభాగమే. స్పిన్నర్ల ప్రదర్శనతోనే తొలి రెండు మ్యాచ్ లలోనూ విజయాలు నమోదు చేసింది.టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకుకు చేరిన తెలుగు అమ్మాయి శ్రీ చరణి మూడు మ్యాచుల్లోనూ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వరల్డ్‌ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీచరణి టాపర్ గా ఉంది. దీప్తి శర్మ ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన మినహా.. మిగతా రెండింట్లో ప్రభావం చూపించలేదు. పేసర్లు కూడా రాణించడం లేదు. శ్రీచరణికి తోడు దీప్తి శర్మ, మరో పేసర్ రాణిస్తే భారత్ బంగ్లాపై భారీ విజయాన్ని అందుకోవచ్చు.

Published : 
  • 25 June 2026, 10:50 AM IST