98వ ఆస్కార్ నామినేషన్స్‌లో భారత్‌కు నిరాశ.. హోమ్ బౌండ్ ఔట్.. రాజమౌళి ఉంటేనే సాధ్యమా..?
98వ ఆస్కార్ అవార్డుల నామినేషన్ల జాబితా విడుదలైంది.. కానీ ఇండియన్ ఆడియన్స్‌కు మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది.
98వ ఆస్కార్ అవార్డుల నామినేషన్ల జాబితా విడుదలైంది.. కానీ ఇండియన్ ఆడియన్స్‌కు మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది. ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డుల రేసులో భారతీయ సినిమాలు చతికిలపడ్డాయి. ప్రపంచ వేదికపై మన సినిమాల సత్తా చాటాలని.. ఈసారి కచ్చితంగా అవార్డు కొట్టాలని ఆశించిన కోట్లాది మంది అభిమానుల కలలు ఆవిరయ్యాయి. ఆస్కార్ బరిలో ఒక్క భారతీయ సినిమా కూడా తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది ఆస్కార్ వేడుకలో భారత్ సందడి కనిపించదని తేలిపోయింది. ముఖ్యంగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ తరపున అధికారిక ఎంట్రీగా వెళ్లిన హోమ్ బౌండ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం ఆస్కార్ రేసులో గట్టి పోటీ ఇస్తుందని భావించారు. కానీ అకాడమీ సభ్యుల ఓటింగ్‍లో ఈ చిత్రం వెనుకబడిపోయింది.
షార్ట్ లిస్ట్ వరకూ వెళ్లగలిగినా అత్యంత కీలకమైన టాప్ 5 నామినేషన్స్‌లో మాత్రం చోటు సంపాదించలేక పోటీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ప్రభుత్వం పంపిన అధికారిక ఎంట్రీలే కాకుండా నిర్మాతలు సొంతంగా ఆస్కార్‌కు పంపిన సినిమాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన కాంతార ఛాప్టర్ 1తో పాటు కన్నప్ప, కుబేరా లాంటి సినిమాలు కనీసం సోదిలో కూడా లేకుండా పోయాయి. భారతీయ చిత్రాలు వివిధ విభాగాల్లో పోటీపడేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. కనీసం టెక్నికల్ విభాగాల్లోనైనా నామినేషన్లు దక్కుతాయని ఆశించినా ఫలితం శూన్యం. అకాడమీ జ్యూరీని మెప్పించడంలో మన సినిమాలు, వాటి క్యాంపెయినింగ్ వ్యూహాలు పూర్తిగా విఫలమయ్యాయని స్పష్టమవుతోంది. ఈ వరుస వైఫల్యాలతో సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు మొదలైంది.
రాజమౌళి ఉంటే గానీ ఆస్కార్ ఇండియాకు రాదా? అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి గ్లోబల్ స్థాయిలో చేసిన ప్రచారం.. వెచ్చించిన సమయం.. పెట్టిన ఖర్చు.. సాధించిన విజయం సామాన్యమైనది కాదు. ఆయన చూపించిన బాటలో నడవడంలో మిగతా మేకర్స్ తడబడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేవలం కంటెంట్ ఉంటే సరిపోదు, దాన్ని ప్రపంచానికి చూపించే జక్కన్న మార్క్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటేనే ఆస్కార్ సాధ్యమా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏదేమైనా 98వ ఆస్కార్ ఫలితాలు ఇండియన్ సినిమాకు ఒక గుణపాఠం లాంటివి. కేవలం అద్భుతమైన కథలను తెరకెక్కించడమే కాకుండా, వాటిని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసుకోవడంలో మనం ఇంకా వెనుకబడే ఉన్నాం. గ్లోబల్ ఆడియన్స్ అభిరుచిని, అకాడమీ ప్రమాణాలను అందుకోవడంలో మన మేకర్స్ మరింత కృషి చేయాల్సి ఉంది. కనీసం వచ్చే ఏడాదైనా బలమైన కంటెంట్, సరైన ప్రణాళికతో మన సినిమాలు ఆస్కార్ వేదికపై మెరుస్తాయని ఆశిద్దాం.











