Top story: డాలర్ డామినేషన్‌కు చెక్.. టైం చూసి దెబ్బకొట్టిన భారత్, ట్రంప్ మళ్లీ మన జోలికి రాడు…!
అమెరికాకు రెండోసారి అధ్యక్షుడయ్యాక ట్రంప్ బ్రిక్స్ దేశాలను టార్గెట్ చేశాడు. అమెరికన్ డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీని తెస్తే 150శాతం టారిఫ్స్ విధిస్తానని బెదిరింపులకు దిగాడు.
అమెరికాకు రెండోసారి అధ్యక్షుడయ్యాక ట్రంప్ బ్రిక్స్ దేశాలను టార్గెట్ చేశాడు. అమెరికన్ డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీని తెస్తే 150శాతం టారిఫ్స్ విధిస్తానని బెదిరింపులకు దిగాడు. ఒక దశలో డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీ తెచ్చే ఆలోచన తమకు లేదని భారత క్లారిటీ ఇచ్చింది. కానీ, ఇప్పుడదే భారత్ డాలర్‌కు చెక్ పెట్టే వ్యూహాలకు పదును పెడుతున్నట్టు కనిపిస్తోంది. రీసెంట్‌గా ఆర్‌బీఐ చేసిన కీలక ప్రతిపాదనే అందుకు కారణం. అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటక రంగాల్లో చెల్లింపుల ప్రక్రియను మరింత సరళతరం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అడుగు వేసింది. బ్రిక్స్ సభ్య దేశాల అధికారిక డిజిటల్ కరెన్సీలను పరస్పరం అనుసంధానించాలని RBI ప్రతిపాదించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ చర్య ద్వారా అంతర్జాతీయ లావాదేవీలలో అమెరికన్ డాలర్‌పై ఉన్న ఆధిపత్యాన్ని తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఏడాది చివర్లో భారత్ అధ్యక్షతన జరగబోతున్న బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాల డిజిటల్ కరెన్సీల అనుసంధానంపై తొలిసారిగా అధికారిక ప్రతిపాదన వెలువడే అవకాశం ఉంది. గతేడాది బ్రెజిల్‌లోని రియో డి-జెనీరోలో జరిగిన బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాల చెల్లింపు వ్యవస్థల మధ్య పరస్పర అనుకూలతను పెంచాలని డిసైడ్ అయ్యారు. తాజా ఆర్‌బీఐ ప్రతిపాదన ఆ నిర్ణయానికి కొనసాగింపుగా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రిక్స్ దేశాల్లో ఏదీ పూర్తిస్థాయిలో డిజిటల్ కరెన్సీని రిలీజ్ చేయనప్పటికీ ఐదు ప్రధాన దేశాలు పైలట్ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. భారత్ తన డిజిటల్ కరెన్సీ రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. 2022 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ-రూపీకి ప్రస్తుతం 70 లక్షల మంది రిటైల్ వినియోగదారులున్నారు. ఆఫ్‌లైన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీల కోసం ఆర్‌బీఐ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. మరోవైపు చైనా కూడా తన డిజిటల్ యువాన్ అంతర్జాతీయ వినియోగాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, డిజిటల్ కరెన్సీ అనుసంధానం డాలర్ డామినేషన్‌కు ఎలా చెక్ పెడుతుంది?
ప్రస్తుతం అంతర్జాతీయ లావాదేవీలు ఎక్కువగా అమెరికా నియంత్రణలోని స్విఫ్ట్ నెట్‌వర్క్ ద్వారా జరుగుతున్నాయి. బ్రిక్స్ సభ్యదేశాలు తమ డిజిటల్ కరెన్సీలను అనుసంధానించడం ద్వారా నేరుగా డిజిటల్ రోడ్‌ను ఏర్పాటు చేసుకుంటాయి, దీనివల్ల స్విఫ్ట్ అవసరం లేకుండానే లావాదేవీలు పూర్తి చేయొచ్చు. ఈ విధానం వల్ల సభ్య దేశాలు తమ సొంత కరెన్సీల్లోనే వ్యాపారం చేసుకుంటాయి. ఉదాహరణకు చైనాతో రూపాయి-యువాన్‌తో వాణిజ్యం చేసుకోవచ్చు. రష్యాతో రూపాయి-రూబుల్‌తో వ్యాపార లావాదేవీలు జరపొచ్చు. దీనివల్ల ప్రతి లావాదేవీనీ డాలర్లలోకి మార్చాల్సిన అవసరం తప్పుతుంది. డాలర్ మధ్యవర్తిత్వం లేకపోవడం వల్ల కరెన్సీ మార్పిడి ఖర్చులు 3-5శాతం వరకు తగ్గుతాయి. చెల్లింపులు రోజుల వ్యవధిలో కాకుండా సెకన్లలోనే పూర్తవుతాయి. అమెరికా తరచుగా డాలర్ వ్యవస్థను ఉపయోగించి ఇతర దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తుంటుంది. బ్రిక్స్ దేశాల సొంత చెల్లింపు వ్యవస్థ ద్వారా ఈ రాజకీయ ఒత్తిళ్ల నుండి, డాలర్ హెచ్చుతగ్గుల ప్రభావం నుండి రక్షణ దొరుకుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి ఇదే ఆరంభం అవుతుంది.
డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీ తెస్తే 150శాతం సుంకాలు విధిస్తానని బెదిరిస్తున్న ట్రంప్‌కు.. చాలా తెలివిగా డిజిటల్ కరెన్సీ అనుసంధానంతో చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. తమ ప్రయత్నాలు డాలర్‌కు చెక్ పెట్టే లక్ష్యంతో కావు.. కేవలం వాణిజ్య సౌలభ్యం కోసమేనని భారత్ స్పష్టం చేస్తోంది. కాబట్టి, ఈ విషయంలో ట్రంప్ చూస్తూ ఊరుకోవడం మినహా చేయడానికేం ఉండకపోవచ్చు. నిజానికి.. డాలర్‌కు చెక్ పెట్టాల్సిన అవసరం భారత్‌కు కూడా ఉంది. డాలర్‌కు చెక్ పెడితేనే రూపాయి పతనానికి బ్రేకులు పడతాయి. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే మన కరెన్సీ విలువ ఏకంగా 91 రూపాయలు దాటిపోయింది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు భారత్ నుండి డాలర్లను వెనక్కి తీసుకోవడంవల్లే రూపాయి పతనం అవుతోంది. డాలర్‌పై ఆధారపడటం తగ్గితే, అమెరికా అంతర్గత ఆర్థిక నిర్ణయాల ప్రభావం ఇండియన్ రూపీపై తక్కువగా ఉంటుంది.
అయితే, బ్రిక్స్ దేశాల డిజిటల్ కరెన్సీల అనుసంధానం అంత సులభం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశాల మధ్య ఉండే వాణిజ్య అసమతుల్యతలు, సాంకేతిక పరమైన భిన్నత్వాలు, పాలనా నియమాలను ఏకీకృతం చేయడం వంటి అంశాలపై లోతైన చర్చలు జరగాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనపై ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర సభ్య దేశాల కేంద్ర బ్యాంకులు ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే బ్రిక్స్ కూటమి దేశాల మధ్య వారి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను నేరుగా అనుసంధానించేందుకు చేసే తొలి అధికారిక ప్రయత్నమిదే అవుతుంది. అదే జరిగితే 50శాతం టారిఫ్‌లకు భారత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే అవుతుంది కూడా.










