రేవంత్ కోసం పవన్ సైడ్ అయిపోయాడా..? బీఆర్ఎస్ తో డిప్యూటీ సీఎం మైండ్ గేమ్..?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏమోగానీ.. అక్కడ అనుసరించిన వ్యూహాలపై మాత్రం పెద్ద చర్చ జరుగుతోంది. భారత రాష్ట్ర సమితిని ఎదుర్కొనే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరించిన విధానాలు

Post Published By: dialnews
Updated : 17 February 2026, 1:37 PM IST

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏమోగానీ.. అక్కడ అనుసరించిన వ్యూహాలపై మాత్రం పెద్ద చర్చ జరుగుతోంది. భారత రాష్ట్ర సమితిని ఎదుర్కొనే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరించిన విధానాలు, అమలు చేసిన ప్రణాళికలు, రచించిన వ్యూహాలు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారి తీసాయి. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత, గులాబీ పార్టీని అనేక రకాలుగా రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతూ వచ్చిన మాట వాస్తవం. పార్టీ నాయకత్వంలో ఉన్న లోపాలు కూడా.. రేవంత్ రెడ్డికి బలంగా మారాయి అనే మాట మనం నిత్యం వింటూనే ఉంటాం. ఇక బి ఆర్ ఎస్ నాయకత్వం రేవంత్ రెడ్డిని, తక్కువ అంచనా వేయడం కూడా ఆ పార్టీకి మైనస్ అవుతుంది.

2024 పార్లమెంట్ ఎన్నికల్లో.. భారత రాష్ట్ర సమితి ఒక్క సీటు కూడా గెలవదని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. గెలిచి చూపించాలంటూ సవాలు కూడా చేశారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాట ప్రకారం తెలంగాణలో ఉన్న ఎంపీ స్థానాలను, ఒక్క సీటు మినహా మిగిలినవన్నీ కాంగ్రెస్ - భారతీయ జనతా పార్టీ తమ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత నుంచి గులాబీ పార్టీని ఏ దశలో కూడా రేవంత్ రెడ్డి కోలుకోనీయడం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూశాం. ప్రచారం పెద్ద ఎత్తున చేసినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని.. సాధించే విషయంలో కెసిఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి విఫలమైంది.

ఇక పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అనుకున్న విధంగా.. సత్తా చాటలేదు అనే ఆందోళన ఆ పార్టీ కార్యకర్తల్లో కనబడింది. తాజాగా జరిగిన పురపాలక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ డామినేషన్ స్పష్టంగా కనపడింది. ఈ ఎన్నికలపై దాదాపు నెల రోజుల నుంచి కసరత్తు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాయకత్వానికి ఏవిధంగా దిశా నిర్దేశం చేయాలో.. ఆ విధంగా చేసి నడిపించారు. దీంతో ఆ పార్టీకి బలం ఉన్న వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కూడా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే విషయంలో ఫెయిల్ అయింది. అయితే ఇక్కడ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే విషయంలో, రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనే మాట వాస్తవం.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ.. బలపడుతుందని 2018 నుంచి చెప్తూనే ఉన్నారు. 2023 ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. కానీ ఫలితాలు భిన్నంగా కనిపించాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ విఫలమవుతూ వస్తోంది. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాలను ఎంపీ స్థానాలను గెలిచినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో ఫెయిల్ అయింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కూడా ఆ పార్టీ ప్రభావం చూపించలేదు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఆ పార్టీ ప్రభావం పెద్దగా కనపడలేదు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్లానింగ్ పైనే ఇప్పుడు చర్చ మొదలైంది. సాధారణంగా రేవంత్ రెడ్డిని బిజెపికి దగ్గరగా ఉన్నారంటూ కొంతమంది విమర్శిస్తూ ఉంటారు.

భారత రాష్ట్ర సమితి పదేపదే ఈ విషయంలో ఆరోపణలు చేస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు గమనిస్తే అదే నిజమంటున్నారు కొందరు. తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ముందు నుంచి హడావుడి జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తే, తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేసే అవకాశం ఉండవచ్చు అంటూ వార్తలు వచ్చాయి. జనసేన పార్టీ, బిజెపి, టిడిపి కూటమి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించేందుకు రంగం సిద్ధం చేసుకుందని హడావిడి జరిగింది. కానీ టిడిపి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రాలేదు. ఇదే సమయంలో టిడిపి కార్యకర్తలు అందరూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కోసం పనిచేయడం మొదలుపెట్టారు.

ఇక జనసేన పార్టీ కూడా బిజెపితో పొత్తు పెట్టుకోకుండా.. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత స్నేహపూర్వక పోటీ అని చెప్పింది. జనసేన తరఫున పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ప్రచారం చేస్తారని కూడా అందరూ భావించారు. ఫిబ్రవరి 6 లేదా 7 తేదీల్లో ఆయన ప్రచారం చేసే అవకాశం ఉండవచ్చు అంటూ హడావుడి జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. అనివార్య కారణాలతో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం లేదంటూ ప్రకటన వచ్చింది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి కోసమే.. పవన్ కళ్యాణ్ సైడ్ అయిపోయారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక అక్కడ ప్రచారం చేసి ఉంటే జనసేన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులో కొంత ప్రభావితం చేసి ఉండేది.

బిజెపి కూడా ఎన్నికల్లో సీరియస్ గా ముందుకు వెళ్లి ఉంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే విషయంలో కీలకంగా వ్యవహరించేది. అందుకే బిజెపి ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గానీ ఎవరూ కూడా ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియాలో గాని, ఎలక్ట్రానిక్ మీడియాలో గాని ఎక్కడా కూడా హడావుడి చేయలేదు. టిడిపి అధిష్టానం ఈ ఎన్నికల విషయంలో సైలెంట్ గానే ఉండిపోయింది. కనీసం ఉమ్మడి నల్గొండ తో పాటుగా, ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందని ఆశించారు. ఎక్కడో ఒకరిద్దరూ కౌన్సిలర్లు తప్ప మిగిలిన వారందరూ కూడా సైలెంట్ గానే ఉన్నారు. దీనితో తెలంగాణలో జనసేన లేదా టిడిపి.. రేవంత్ రెడ్డికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నాయని.. ఈ విషయం తెలిసే బిజెపి సైలెంట్ అయిపోయిందంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. లేదా రేవంత్ రెడ్డి కోసమే బిజెపి కూడా సైలెంట్ అయిపోయి ఉండవచ్చు అంటూ ప్రచారం మొదలైంది.

Published : 
  • 17 February 2026, 1:37 PM IST