Top Story: బి ఆర్ఎస్ లేవదు…. బిజెపి ఎదగదు…. తెలంగాణకి కాంగ్రెస్సే దిక్కా????

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 80% పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కార్పొరేషన్ లోను ఐదు కార్పొరేషన్లను దక్కించుకుంది.

Post Published By: dialnews
Updated : 14 February 2026, 9:13 AM IST

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 80% పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కార్పొరేషన్ లోను ఐదు కార్పొరేషన్లను దక్కించుకుంది. టిఆర్ఎస్40% డివిజన్లను దక్కించుకున్నప్పటికీ ఎక్కువ మున్సిపాలిటీలు మాత్రం గెలుచుకోలేకపోయింది. ఇక కార్పొరేషన్ లోనయితే టిఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయింది. అసలు తెలంగాణని పదేళ్లపాటు పాలించిన పార్టీయేనా ఇది అనిపిస్తుంది బి ఆర్ ఎస్ ను చూస్తే.2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్, 20 24 లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. ఆ తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నిన్న కాక మొన్న సర్పంచ్ ఎన్నికల్లోనూ 70 శాతం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోను 80 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అధికార పార్టీ గనక.... డబ్బు కుమ్మరించి, అధికార యంత్రాంగాన్ని వినియోగించి మున్సిపాలిటీలో గెలిచిందని ప్రత్యర్ధులు విమర్శించవచ్చు. ఏది ఎలా చేసినా గెలుపు గెలుపే.

కానీ తెలంగాణలో బి ఆర్ ఎస్ పరిస్థితి.... అగమ్య గోచరంగా ఉంది. పదేళ్లు తెలంగాణని పరిపాలించిన ఆ పార్టీ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడింది. మున్సిపాలిటీల్లో గట్టిగా 20 కూడా గెలవలేకపోయింది. రేవంత్ సర్కార్ ఏర్పడి రెండేళ్లయిన, ప్రభుత్వంపై అంతో ఇంతో జనంలో వ్యతిరేకత ఉన్నా కూడా.... అది టిఆర్ఎస్ పై సానుభూతిని మాత్రం పెంచలేకపోతోంది. టిఆర్ఎస్ పై ప్రజల్లో ఆదరణ పెరగట్లేదు. అంటే ఆ పదేళ్లపాటు టిఆర్ఎస్ చేసిన అరాచకాలు, అహంకార ధోరణిని ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారా? సీనియర్ నేతలు సమర్థంగా పనిచేయలేకపోతున్నారా? అసలు బి ఆర్ ఎస్ కేడర్ అంతా ఏమైపోయింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు.

మున్సిపల్ ఎన్నికల్లో గట్టిగా తలపడాల...లేదా అన్నదే ఆ పార్టీ నిర్ణయించుకోలేకపోయింది. పోలింగ్కు మూడు రోజులు ముందు హడావుడిగా నేతలు ప్రచారానికి దిగారు. ఎన్నికల కోసం పెద్దగా డబ్బు కూడా ఖర్చు చేయలేదు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఓడిన పెద్ద ప్రయోజనం ఏముంది అనుకున్నారేమో..... ఎక్కడా గట్టి పోటీ ఇవ్వలేదు. అందుకే 20 మున్సిపాలిటీలు గెలవడం కూడా కష్టమైంది. టిఆర్ఎస్ తన పార్టీ గురించి తానే విశ్లేషించుకోవాల్సిన అవసరం వచ్చింది. కెసిఆర్ పై ప్రజల్లో ఎందుకు సానుభూతి రావటం లేదు. కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉన్న దాన్ని టిఆర్ఎస్ ఎందుకు క్యాష్ చేసుకోలేక పోతుంది.? వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ అంత సమర్థంగా పనిచేయలేకపోతున్నాడా? రేవంత్ ని బూతులు తిట్టడం వలన ప్రజల్లో చులకనైపోయాడా? ఎక్కడ తేడా కొడుతుంది అన్నది టిఆర్ఎస్ విశ్లేషణ చేసుకోవాలి. ఇదే పరాజయాల పరంపర కొనసాగితే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ గట్టు ఎక్కడైనా కష్టమే.

ఇక తెలంగాణలో బిజెపి పరిస్థితి దారుణాతి దారుణం. 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, 27 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోతుంది. పార్టీకి దశాదిశా లేదు, రాష్ట్ర పార్టీని నడిపించే దమ్మున్న నాయకుడు లేడు.... సరైన కార్యకర్తలు లేరు... నేతలు లేరు. ఈరోజు మోడీ బొమ్మ పెట్టుకుని బతికేయాలని తెలంగాణ బిజెపి ప్రయత్నిస్తోంది. అందుకే సొంతంగా ఎదగలేక పోతోంది. కిషన్ రెడ్డి లాంటి సూడో హిందుత్వవాదు లు .. తెలంగాణలో బిజెపిని ఎదగకుండా చేస్తున్నారు.

బండి సంజయ్ లాంటి అగ్రెసివ్ లీడర్స్ ఉన్నప్పటికీ ఆయనకు నాయకత్వ బాధ్యతలు ఇవ్వరు. దీంతో బిజెపి తెలంగాణలో కుదేలు అయిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో కేవలం రెండంటే రెండు మున్సిపాలిటీలు మాత్రమే గెలుచుకోగలిగింది. రామచంద్ర రావు లాంటి వెన్నుముక లేని నాయకుడిని రాష్ట్ర అధ్యక్షులు చేయడం ద్వారా అధిష్టానానికి తెలంగాణపై పెద్ద ఆసక్తి లేదనే విషయం అర్థమవుతుంది.మొత్తం మీద తెలంగాణలో పడిపోయిన బి.ఆర్.ఎస్ తిరిగి లేవలేక పోతుంది. బిజెపి ఎదగలేక పోతుంది.రేవంత్ సర్కార్ పై అవినీతి ఆరోపణలు ఉన్న... ప్రజల్లో అసంతృప్తి ఉన్న.... బలహీనమైన ప్రత్యర్ధులు ఉండటం వల్ల కాంగ్రెస్కు ఎదురు లేకుండా పోతుంది.

Published : 
  • 14 February 2026, 9:13 AM IST