Top story: ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ ?
హరీష్ రావు, కేటీఆర్ వంతు ముగిసింది. ఇక మిగిలింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్'' ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే విషయంపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది.
హరీష్ రావు, కేటీఆర్ వంతు ముగిసింది. ఇక మిగిలింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్” ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే విషయంపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఈ కేసులో నేరుగా బీఆర్‌ఎస్ కింగ్ పిన్స్‌ను టార్గెట్ చేస్తోంది సిట్. ఇప్పటికే కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్‌ను ఈ కేసులో విచారించింది. దీంతో సిట్ నెక్స్ట్ టార్గెట్ కేసీఆరేనా అనే వాదన తెరమీదకు వచ్చింది. వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఫోన్ ట్యాపింగ్ లాంటి కేసులో నేరుగా బీఆర్ఎస్ పెద్దలను విచారణకు పిలవడం ఇప్పుడు గులాబీ దళంలో గుబులు రేపుతోంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులైన హారీష్ రావు, కేటీఆర్‌ను సిట్ విచారించింది. గంటల పాటు జరిగిన వీళ్ల విచారణలో సిట్ ఎలాంటి సమాచారం సేకరించింది అనేది పక్కన పెడితే.. ఇద్దరు కింగ్ పిన్స్ లాంటి నేతలను విచారణకు పిలవడంతో.. ఇప్పుడు సిట్ తరువాతి టార్గెట్ ఎవరు అనేది సస్పెన్స్‌గా మారింది. ఈ కేసులో తరువాత నోటీసులు రాబోయేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే అనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు మరోసారి తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. మొదట్లో కేవలం పోలీస్ అధికారుల వరకు మాత్రమే పరిమితమైన సిట్ విచారణ.. ఇప్పుడు రాజకీయ నేతల వైపు అడుగులు వేయడంతో పరిణామాలు మారిపోతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకోవడంతో బీఆర్ఎస్‌లో గుబులు మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, సొంత పార్టీ నేతల ఫోన్లనూ అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలపై సిట్ లోతుగా విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలుపురు అధికారులు జైలులో ఉండగా, రాజకీయ నాయకుల ప్రమేయంపై సిట్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు అందబోతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. ఫోన్ ట్యాపింగ్ లాంటి అత్యంత సున్నితమైన వ్యవహారం. అప్పటి సీఎంకు తెలియకుండా జరిగే అవకాశం లేదని ప్రస్తుత ప్రభుత్వం వాదన. సమాచారం సేకరించేది అధికారులే అయినా.. చివరికి విషయం చేరాల్సింది సీఎం దగ్గరికే. కాబట్టి సీఎంకు తెలియకుండా ఈ వ్యవహారం జరిగే ఛాన్సే లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే అరెస్టయిన పోలీస్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలాల్లోనూ ‘పైస్థా యి ఆదేశాల’ మేరకే అని ప్రస్తావించినట్లు తెలిసింది. ఆ ‘పైస్థాయి’ ఎవరనేది నిరూపించే పనిలో సిట్ ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఆయనను విచారణకు పిలిచే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు, కేటీఆర్‌ను సిట్ విచారించడంతో బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది. అగ్రనేతల స్థాయిలో విచారణలు మొదలవుతున్నాయన్న సంకేతాలతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు అధికార యంత్రాంగానికే పరిమితమైన వ్యవహారం.. ఇప్పుడు రాజకీయ నేతలదాకా చేరడంతో.. పార్టీలో అంతర్గతంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు.. ఒకదాని తర్వాత ఒకటి చోటుచేసుకుంటున్న పరిణామాలు బీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయో, విచారణ ఏ దిశగా సాగుతుందోనన్న అనిశ్చితి పార్టీ నేతలు, కేడర్‌లో కంగారును పెంచుతోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సున్నితమైన అంశం కావడంతో.. ఈ కేసు రాజకీయంగా మరింత ప్రభావం చూపుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్‌కు మరో తలనొప్పిగా మారింది. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలకు వరుసగా నోటీసులు వస్తున్నాయి కాబట్టి ఈ కేసులో కవితకు కూడా నోటీసులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ కవిత చాలా కాలంగా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగానే పని చేస్తున్నారు. తాను కేసీఆర్‌కు రాసిన లెటర్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పటి నుంచే బీఆర్ఎస్ మీద పోరాటం మొదలు పెట్టారు కవిత. మాజీ ఎంపీ సంతోష్ రావు, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కవిత వ్యవహారం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓ తలనొప్పిగా మారింది. అయితే ఈ కేసులో కవితకు నోటీసులు ఇస్తరా లేదా అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. ఒకవేళ నోటీసులు ఇస్తే మాత్రం ఇక బీఆర్‌ఎస్‌కు నిద్రలేని రాత్రులు రావడం గ్యారంటీ అంటున్నారు విశ్లేషకులు.











