మెగాస్టార్ సినిమాకు కొత్త చిక్కులు.. 42 కోట్లు వెనక్కి ఇవ్వాల్సిందేనా..? హిట్టైన సంతోషం లేదా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వేళ.. చిత్ర యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2026 | 02:00 PMLast Updated on: Jan 24, 2026 | 2:00 PM

New Troubles For The Megastars Film Will They Have To Return 42 Crores

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వేళ.. చిత్ర యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది. సినిమా హిట్ అయ్యిందని సంబరపడేలోపే పెంచిన టికెట్ రేట్ల వ్యవహారం ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన టికెట్ రేట్ల పెంపు ద్వారా వసూలైన మొత్తాన్ని తిరిగి రికవరీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ ఈ నెల 8న హోంశాఖ ఒక మెమో జారీ చేసింది. దీని ప్రకారం.. ప్రత్యేక షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అలాగే వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 చొప్పున అదనంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు.

అయితే కోర్టు పాత ఆదేశాలకు విరుద్ధంగా ఈ మెమో జారీ అయ్యిందని.. దీనివల్ల ప్రేక్షకులపై భారీ భారం పడిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ టికెట్ రేట్ల పెంపును సవాలు చేస్తూ న్యాయవాది పాదూరి శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ జారీ చేసిన ఈ మెమో ద్వారా, నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు దాదాపు రూ.42 కోట్లు అక్రమంగా ఆర్జించారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన ఈ మొత్తాన్ని తక్షణమే రికవరీ చేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు.. ఈ వ్యవహారంపై స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, జీఎస్టీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అసలు ఈ రూ.42 కోట్ల వసూళ్ల లెక్కలేంటి? ఎంత మొత్తం అదనంగా వసూలైంది? అన్న పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది.

ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. ఎంతో కష్టపడి సినిమా తీసి.. అది హిట్ అయ్యాక ఆ సంతోషాన్ని ఆస్వాదించే సమయం కూడా దర్శక నిర్మాతలకు లేకుండా పోతోంది. ఒకపక్క పైరసీ భూతం, మరోపక్క ఇలాంటి న్యాయపరమైన చిక్కులు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టికెట్ రేట్ల పెంపు అనేది బడ్జెట్ రికవరీ కోసం అనివార్యమని నిర్మాతలు వాపోతుంటే, నిబంధనల పేరుతో వచ్చే ఇలాంటి పిటిషన్లు సినిమా విజయాన్ని పూర్తిగా ఆస్వాదించనీయకుండా చేస్తున్నాయన్నది సినీ వర్గాల ఆవేదన.